చిక్కడపల్లి, నవంబర్ 20: ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా కవులు కలాలు ఝళిపించాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. పాట సజీవమైనదని, తెలంగాణ రావడానికి పాట ఎంతో తోడైందని చెప్పారు. తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో లిటరరీ ఫెస్ట్-2022ను ఆదివారం సుందయ్య విజ్ఞాన కేం ద్రంలో నిర్వహించారు. ఫెస్ట్‌లో గోరటి వెంక న్న మాట్లాడుతూ.. తెలంగాణపై ఆధిపత్యం వహించాలని చూస్తున్న శక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు మతం మత్తు ఎక్కించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలను ప్రగతిశీల శక్తులు, కవులు రచయితలు, ప్రజాస్వామిక వాదులు తిప్పికొట్టాలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ పిలుపునిచ్చారు.
వీర తెలంగాణ సాయుధ పోరాటం ఒక మతానికి వ్యతిరేకంగా జరిగినది కాదని.. అది భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర పోరాటమన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి కే ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహితి, సినీ విమర్శకులు తెలకపల్లి రవి, సినీ నటుడు మాదాల రవి, రచయిత్రి పీఏ దేవి, ప్రసిద్ధ కవి యాకూబ్, ప్రముఖ గీత రచయిత దేవేంద్ర, తెలంగాణ సాహితి సంస్థ అధ్యక్షుడు వల్లభపురం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.