హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యే నెకొంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజవకర్గంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 25,921 మంది ఓట్లర్లు ఉన్నారు.
నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 14,940 మంది పురుషులు, 9965 మంది మహిళలు ఉన్నారు. బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నా… ఐదారుగురు ప్రధాన అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొందన్న అభిప్రాయాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ, టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి, బీసీ సంఘాల నుంచి టీచర్స్ జాక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీసీసీ అధికార ప్రతినిధి, మాజీ పీఆర్టీయూ నేత గాలిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ప్రధాన సంఘాల నుంచి బరిలో నిలిచారు. దాంతో ఆయా సంఘాల బలాబలాలు, సామాజిక అంశాల ఆధారంగా వారంతా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రచారం ముగియనుండడంతో తర్వాత ఓటర్లను కచ్చితంగా తమ వైపు తిప్పుకొనేందుకు కావాల్సిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది.