హనుమకొండ చౌరస్తా, జూన్ 4 : ‘తెలంగాణ అంటే మనకు అస్తిత్వం.. ఆంధ్రావాళ్లకు మాత్రం ఆస్తి’ అని తెలంగాణ వికాస సమితి గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా గురువారం హనుమకొండ అశోక కాన్ఫరెన్స్ హాల్(అనిశెట్టి రజిత ప్రాంగణం) లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఇక్కడ దేశపతి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు కు మన హైదరాబాద్ కావాలి, పాతబస్తీ వద్దు.. కానీ హైటెక్‌సిటీ, ఓఆర్ఆర్ కావాలని విమర్శించారు. నీళ్లు పారే తెలంగాణలో నె త్తురు పారించే కుట్రలే సాగుతున్నాయని, ఈ దండయాత్రలకు కారణం అదే అని హెచ్చరించారు. తెలంగాణ ఎవరిదో దాశరథి ఎప్పుడో చెప్పారు.. ఇప్పుడు ఒకాయన వచ్చి తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉ న్నదని మండిపడ్డారు.
‘తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని ఓ కోన్కిసా మాట్లాడుతున్నడు.. తెలంగాణ పౌష్టికాహారం ఆయనకు అందలేదు.. అందుకే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నడు’ అని ఎద్దేవా చేశారు. సురవరం ప్రతాప్‌రెడ్డి అన్ని పనులు తానే స్వయం గా చేసుకొనేవారని, ఆంధ్రా కవులు కృష్ణారా వు, కందుకూరు వీరేశలింగం, మల్లంపల్లి సో మశేఖర్ శర్మ ఇంతమంది చేసే పనిని ఒక్క సు రవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణలో చేశారని గు ర్తుచేశారు. అనిశెట్టి రజిత తెలంగాణ కోసం ఎంతో పరితపించింది, ఎన్నో పుస్తకాలు వేసిం ది.. మహిళా రచయితలను ఒకటిగా చేసింది.. ఇలాంటి గుణం ఒక్క తెలంగాణ కవులకే ఉంటుందని తెలిపారు. తెలంగాణ వికాస స మితి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య ఆధ్వర్యంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పేరుతో కొత్త వేషం వేసుకొని పాతవాళ్లు వస్తున్నారని, గద్దలు, మోసగాళ్లను ప్రజలు గుర్తుపెట్టుకోవాలని హె చ్చరించారు.
వరంగల్‌తోనే తెలంగాణ ముడిపడి ఉన్నదని, ఆంధ్రావాళ్లు రాణీ రుద్రమదేవిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారని తెలిపారు. మొగిలయ్య, కాళోజీ, దాశరథి, సురవరం ప్ర తాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు లాంటివారు పట్టుబట్టి ఇక్కడే కవి సమ్మేళనాన్ని నిర్వహించారని గుర్తుచేశారు. 1969 మలి దశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది వరంగల్ నుంచేనని, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ రచయితల వేదిక మొ దటిసారిగా ఇకడ నుంచే శంఖారావం పూ రించిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరో వ చ్చి తెలంగాణ నీ అయ్య జాగీరా అంటే ఎలా ఉంటుందని మండిపడ్డారు. మనం కవులుగా చెప్పాల్సింది.. తెలంగాణ కోసం నిలబడదాం, తెలంగాణ కోసమే జీవిద్దాం, తెలంగాణ కో సమే రాద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం ప్రముఖ కవులు వీఆర్ విద్యార్థి, రామాచంద్రమౌళి, వఝల శివకుమార్, నెల్లుట్ల రమాదేవి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి మురళీకృష్ణ, ఎన్వీఎన్ చారి, బిల్లా మహేందర్, తైదల అంజయ్య, బండారిరాజ్ కుమార్, పెద్ది వెంకటయ్య, సిరాజుద్దీన్, దేవులపల్లి వాణీదేవి, వల్స పైడి, రామా రత్నమాల, బాలబోయిన రమాదేవి, కోడం కుమారస్వామి, శనిగరపు రాజ్‌మోహన్, షేక్హాజీ నూరానీ, కార్తీకరాజు, కుంజ కల్యాణి, నాగవెల్లి జితేందర్ సామ్రాట్ తమ కవితాగానంతో ఆహుతులను ఎంతగానో ఆలోచింపజేశారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఈ కవి సమ్మేళనంలో కార్యదర్శి మల్లా వఝల విజయ్, మాలోత్ భిక్షపతి నాయక్, నిమ్మల శ్రీనివాస్, నాగిల్ల రామశాస్త్రి, శంకేసి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.