సిటీబ్యూరో/కవాడిగూడ, జూలై 26 (నమస్తే తెలంగాణ): దోమలగూడ నుంచి మిస్సింగ్ అయిన ముగ్గురు మైనర్ బాలికల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి ఆదివారం ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. దోమలగూడకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఈనెల 19న ఇంటినుంచి అదృశ్యమయ్యారు. తల్లి రామ్దులారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఈ మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీటీవీ పుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేయగా పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో దోమలగూడ నుంచి అదృశ్యమైన మైనర్ బాలికల కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పరిధిబస్తీలో నివసిస్తున్న రామ్దులారీ కుటుంబం జీవనోపాధి కోసం ఈ ఏడాది మేనెలలో చత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు వలస వచ్చింది. ఈనెల 19న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వారి ఇద్దరు కుమార్తెలతో పాటు మరొక మైనర్ బాలిక ఇంటి నుంచి అదృశ్యమయ్యారు.
తెల్లవారుజామున మూడుగంటల సమయంలో విషయం గుర్తించిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, 262 సీసీ టీవీ కెమెరాల ఫుటేజిలను పరిశీలించారు. దీంతో బాలికల కదలికలపై స్పష్టత వచ్చినట్లు డీసీపీ తెలిపారు.
పరిధి బస్తీలోని ఇంటి నుంచి బయలు దేరిన బాలికలు చత్తీస్గడ్కు చేరుకున్నట్లుగా గుర్తించిన పోలీసులు కాంకర్ ఏరియా పోలీసుల సహకారంతో ముగ్గురినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో చిన్నారులు అమ్మానాన్నల గొడవల కారణంగా ఇంటినుంచి వెళ్లిపోయినట్లు స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సఖి భరోసా సెంటర్లో అన్ని వైద్యపరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు విచారణ అనంతరం రెండురోజుల్లో తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పారు.