సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాజధాని మహానగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, పాత నేరస్థులపై నిఘా పెట్టడంతో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమవుతున్నది. ప్రతీకార దాడుల నివారణలో పాత నేరస్థులపై నిఘా, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ వంటివి పోలీస్ విభాగంలో కీలక భూమిక పోషిస్తాయి. గత బీఆర్ఎస్ హయాంలో జైలు నుంచి బయటకు వచ్చే పాత నేరస్థులపై పక్కాగా నిఘా కొనసాగేది.
నేరం చేసిన వారికి పక్కాగా శిక్ష పడేలా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ పనిచేసేది. అయితే నేడు ఈ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడంతో పాత నేరస్థులు జైలు నుంచి బయటకు రాగానే ప్రతీకార దాడులకు తెగబడుతున్నారు. బెయిల్‌పై వచ్చే రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడితే, నిఘా ఉందనే భయంతో నేరాల మైండ్‌సెట్‌ను మార్చేందుకు ప్రయత్నించే చర్యలు ఉండేవి. ప్రస్తుతం పాతనేరస్థులపై నిఘాతోపాటు కోర్టు మానిటరింగ్ సిస్టమ్ కూడా పక్కాగా పనిచేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పాత నేరస్థులపై క్షేత్ర స్థాయిలో నిఘా లోపించడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరం చేసిన వారికి తప్పని సరిగా శిక్ష పడేలా ప్రత్యేకంగా ఆయా కేసుల విచారణ, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడం వంటి అంశాలతో కోర్టు మానిటరింగ్ సిస్టం పనిచేసేది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అమలు చేసేందుకు ఒక బృందం ఉంటుంది. ప్రత్యేకంగా కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్స్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుంటారు. ఆయా కేసులలోని నిందితులు బెయిల్‌పై బయటకు వెళ్లి, కోర్టు విధించిన షరతులను నిందితులు పాటిస్తున్నారా? లేదా? అనేది పరిశీలిస్తుంటారు. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కోర్టు మానిటరింగ్ సిస్టమ్‌కు సుస్తి చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రతి నిత్యం వందల కేసులు నమోదవుతుంటాయి, అందులో కొందరు తెలిసీ తెలియక చేసిన పొరపాట్లు, క్షణికావేశంలో చేసినవైతే, మరికొన్ని ఉద్దేశపూర్వకంగా చేసేవి, నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్లు తరుచూ నేరాలు చేయడం, పగలు, ప్రతీకారాలతో చేసే నేరాలు ఉంటాయి. కేసుల తీవ్రతను బట్టి కొందరికి స్టేషన్లోనే బెయిల్ ఇవ్వడం, మరికొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. మరి కొందరు పోలీసులకు చిక్కకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందుతుంటారు. ఆయా పోలీస్స్టేషన్ల నుంచి అరస్టై జైలుకు వెళ్తున్నవారెవరు, వారి నేర స్వభావం వంటి అంశాలను పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు.
జైలు నుంచి బయటకు వెళ్లేవారు ఏం చేస్తున్నారు, జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు, ఎక్కడుంటున్నారు, ఏ కేసులో అరస్టై జైలుకు వెళ్లి వచ్చారు, సదరు నిందితుడిపై ఫిర్యాదు చేసిన వారికి హాని ఉందా? ఇలా ప్రతి అంశాన్నీ పరిశీలనలోకి తీసుకొని పాత నేరస్థులపై క్షేత్రస్థాయి పోలీసులు నిఘా కొనసాగించాలి. కానీ ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి నేరస్థులపై సరైన నిఘా లేకపోవడంతో కొందరు జైలు నుంచి బయటకొచ్చి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో ఒక నేరస్తుడిపై గతంలో రెండు సార్లు పీడీయాక్టులు ప్రయోగించారు, అయినా ప్రవృత్తిని మాత్రం మానుకోలేదు, జైలు నుంచి బయటకొచ్చిన తరువాత సాక్ష్యులు, ప్రత్యర్థులపై మూడు సార్లు దాడులకు పాల్పడ్డాడు.
మల్కాజిగిరికి చెందిన వ్యక్తి తుపాకీతో అంబర్‌పేట్‌లో అరస్టై బెయిల్‌పై బయటకొచ్చి తన భార్యపై పగ పెంచుకొని మరోసారి తుపాకీ తెచ్చుకొని కాల్చి చంపాడు. ఇక్కడ పోలీసులు సదరు నిందితుడిపై నిఘా పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. ఇటీవల మీర్పేట్ ప్రాంతంలో జరిగిన ఒక హత్య కేసులోనూ నిందితులు జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ప్రతీకార చర్యలకు పాల్పడ్డాట్లు ఆరోపణలున్నాయి. సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు సైతం ముందస్తు బెయిల్ పొంది, ఆ తరువాత తనపై ఫిర్యాదు చేసిన వారిని విచక్షణారహితంగా పొడిచి చంపాడు.
పాత నేరస్థులపై నిరంతరం నిఘా కొనసాగించాల్సిన అవసరముంటుంది. నిందితులు ఏ కేసులో జైలుకు వెళ్లారు, జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రతీకార దాడులకు పాల్పడే అవకావాశాలున్న కేసులలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిందితులు జైలు నుంచి బయకొచ్చిన తరువాత ఏం చేస్తున్నారు, ఎక్కడుటుంటున్నారు.. అనే అంశాలపై ఫోకస్ పెట్టాలి. అందుకు క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి. పాత నేరస్థులు, రౌడీషీటర్లు ఉండే ఇళ్లకు గతంలో జియో ట్యాగింగ్ చేసి, వారిపై నిఘా పెట్టేవారు, నేడు కనీసం పర్యవేక్షణ కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని బాధితులతోపాటు సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.