అన్ని తలుపులూ మూసుకున్నాయని
ఈ గోడల్ని నమ్మకు
ఇటుకల మధ్య కూడా
ఒక వెలుతురు చినుకు దాక్కునే ఉంటుంది
నిశ్శబ్దమంటే శూన్యమే కాదు
మనసు లోతుల్లో మొలకెత్తే పదాల నేల అది
ఋతువులెన్ని మారినా
కొన్ని చెట్లు పూతకు దూరమవుతాయి
అలా అని వాటి వేర్లు ఊపిరి తీసుకోవడం మానవు
చిట్లిన పగుళ్లన్నీ విరిగిపోయిన గుర్తులు కావు,
లోపలి ఆకాశాన్ని బయటకు తెరిచే కిటికీలే అవి
నడిచే దారంతా ముళ్లతో నిండిపోయిందని
పాదాలను నిందించకు రక్తం కారిన చోటే
ధైర్యం మొదటి అక్షరాన్ని రాస్తుంది
మనుషులు మారిపోతుంటే
మాటలు రంగును కోల్పోతాయి
ఆశలు చేతులు దులుపుకుని
వెనుతిరిగినట్టే అనిపిస్తుంది
అయినా లోపలెక్కడో
ఒక చిరుదీపం గాలితో రాజీపడకుండా
మండుతూనే ఉంటుంది
అదే జీవితం ఓ గెలుపు పండుగ కాదు,
ప్రతిసారి కూలిపోయిన చోట
మరో ఇటుకను ఎత్తగలననే మొండి నమ్మకం
చెదిరిన కలల్ని చితిమంటలో వేయకు,
వాటి బూడిదలోంచే రేపటి అడవులు
పచ్చగా చిగురిస్తాయి
ఒక్కసారి ఆకాశాన్ని చూసి నడువు
నిన్నటి చీకటి కూడా
నేటి నీడగా నీతోనే నడుస్తుంది
విరిగిన చోటును మనసులో దాచకు,
చిట్లిన ఆ గాయమే నీ బలానికి కొత్త ఊపిరి
ఎందుకంటే వెలుగు
జీవితానికి ఎక్కడి నుంచో రాదు
చివరి మెట్టు మీద నిలబడినప్పుడు
నువ్వే ఒక కాంతికిరణమై తళుక్కుమంటావు
-ఎన్. లహరి
9885535506