హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సీబీఐ, ఈడీ, ఐటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జేబు సంస్థలని ఆరోపించిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఏజెన్సీలపై నమ్మకం ఎలా వచ్చిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. బీజేపీ, మోదీతో కాంగ్రెస్ కుమ్మైక్కె తెలంగాణ ప్రజల ఆత్మబంధువైన బీఆర్ఎస్ను భూస్థాపితం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో రెండు పార్టీలే మిగిలితే మనం మనం చూసుకోవచ్చనే ఉద్దేశంతో కూడబలుక్కొని దుష్ట పన్నాగానికి తెరలేపాయని దుయ్యబట్టారు. సోమవారం గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీ పార్టీల కుట్రలో భాగమే సీబీఐ విచారణ అని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సీబీఐ విచారణను తప్పుబట్టి ఢిల్లీలో ధర్నా చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే ఏజెన్సీకి కాళేశ్వరం విచారణను అప్పగించడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. సీబీఐ విచారణ బూటకమని, కమిషన్ నివేదిక నాటకమని మండిపడ్డారు. పూటకో మాటతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.