MLC Deshapathi Srinivas | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి మదిలో ఉద్యమ సమయంలోనే ముద్రించబడిందని చెప్పారు. ఇప్పుడు విగ్రహాన్ని మారుస్తామని బయల్దేరిన రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్రలో తెలంగాణ తల్లి, కేసీఆర్ చిరస్థాయిలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. విగ్రహాన్ని మార్చి ప్రజల వ్యతిరేకతకు లోనుకావొద్దని సూచించారు. మరిన్ని వివరాలు దేశపతి శ్రీనివాస్
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ప్రతిమ లేకుండా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారు. తెలంగాణ జీవన విధానం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. మనరాష్ట్ర పండుగ బతుకమ్మ. బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో లేకుండా చేయడమేంటి? మన సంస్కృతీసంప్రదాయాలపై ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ తల్లి అంటే దేవత. దేవతల మెడలో నగలు, తలపై కిరీటం ఉండదా? కిరీటాన్ని, నగలను తీసేసి.. ధనవంతులు, పేదలు అనే వ్యత్యాసాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందిరాగాంధీ హరిద్వార్‌లో భారతమాతకు ఆలయం కట్టించారు. ఆమె నిర్మించిన భారతమాత విగ్రహానికి కిరీటం, నగలు ఉన్నాయి కదా..? మరి ఇందిరాగాంధీ చేసింది తప్పని రేవంత్‌రెడ్డి ఒప్పుకుంటారా? భారతమాత దేవత అయినప్పుడు.. తెలంగాణ తల్లి కూడా దేవతనే కదా.. పేదరికం పోయి అందరూ సుసంపన్నంగా బతకాలనే మనమందరం కోరుకుంటాం. పేదరికానికి నిదర్శనంగా తెలంగాణ తల్లిని చూపాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.
తెలంగాణ తల్లిని ప్రజలంతా ఊరూరా ప్రతిష్ఠించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వచ్చి మార్చాలనుకోవడం మూర్ఖత్వం. చరిత్రను చెరిపేయాలనుకోవడం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం. కాకతీయ కళాతోరణం, చార్మినార్, తెలంగాణ తల్లికి నగలు ఉండొద్దని పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తున్నారు.
కేసీఆర్ చేపట్టిన పథకాలకు పేరు మార్చి కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కేసీఆర్ తీసుకొచ్చినవే. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్క కొత్త పథకాన్నీ తీసుకురాలేదు. ఇక.. కేసీఆర్ పేరును, ఆయన చరిత్రను కదిలించడం రేవంత్‌రెడ్డికి ఎలా సాధ్యమవుతుంది? చిత్తశుద్ధి ఉంటే.. విగ్రహాల మార్పు, పథకాల పేర్ల మార్పు చేయడం కాదు. ప్రజలకు మంచి పాలనను అందించాలి. నలుగురు మెచ్చుకునేలా పాలన సాగాలి… ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను తొలగించి, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేయడం కాదు. రేవంత్‌రెడ్డికి ఎందుకు తెలియట్లేదో అర్థం కావడంలేదు.
‘రేవంత్‌రెడ్డి నోటి వెంట ఆనాడు, ఈనాడు, ఏనాడూ జై తెలంగాణ అనే నినాదం రాలేదు. జన్మభూమికి జైకొట్టకుండా.. పార్టీకి జై కొడుతున్నారు. ప్రజల బాగోగులతో రేవంత్‌రెడ్డికి అవసరంలేదు. ఆయన బాగోగులు మాత్రమే ఆయనకు కావల్సింది. రేవంత్‌రెడ్డిది అంబేడ్కర్ విగ్రహానికి ఒక్క పూలమాల వేయని మూర్ఖత్వం. తెలంగాణ చరిత్ర మీద ఏమాత్రం అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లు తొలగించడానికి కుట్ర పన్నుతున్నారు.’ అని దేశపతి విమర్శించారు.