నిజామాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ముఖ్యమంత్రి ఎప్పటికీ చెప్తుంటడు.. బట్టలూడదీసి కొడతా అంటుంటడు.. ఎవరు? రేవంత్రెడ్డి! ఇందిరమ్మ గొప్పదనం తెల్వాలంటెనట.. తెలంగాణలో ఉన్న జనాల బట్టలూడదీసి కొట్టాల్నట! ఆ రేవంత్ బట్టలూడదీసి కొడతానంటుంటే ఆయన ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులు మెడపట్టి బరబర ఈడ్చుకుంటూ పోయిండ్రు ముదాం సాయిల్ను. ఎందుకింత మదం మీకు? ఎందుకింత కావురం మీకు?’ అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో ఆగమైన తెలంగాణ గురించి కామారెడ్డి జిల్లా లింగంపేటలో శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన సభలో ఆయన ఆవేదనభరితంగా మాట్లాడారు. ‘ఇదేంటని అడిగితే వెటకారపు దాడి. మాట నిండా వికారం. తెలంగాణకు తీరని అపకారం’ అంటూ తనదైన శైలిలో విమర్శనాస్ర్తాలు సంధించారు.
మీరు బరబర ఈడ్సుకపోతే కేటీఆర్ వచ్చి దండ వేసిండ్రు.
‘ఇవాళ ఇదే చౌరస్తాలో అదే అంబేద్కర్ సాక్షిగా మీరు బరబర ఈడ్సుకపోయిన మెడలో కేటీఆర్ వచ్చి దండ వేసిండ్రు.. మీరు బట్టలిప్పిన అదే సాయిలుకు ఇవ్వాళ శాలువా గప్పిండ్రు. కండ్లు తెరిచి చూడుండ్రి కాంగ్రెస్ కార్యకర్తల్లారా.. ఖాన్ కోల్ కర్ సునో.. చెరువులు తెరిచి వినండి.. మీరు దళితుల ఆత్మగౌరవం మీద దాడిచేస్తే.. అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిమీద దాడి చేస్తే ఇవ్వాళ మీమీద యుద్ధం ప్రకటిస్తున్నది దళిత సమాజం’ అని దేశపతి తీవ్రంగా హెచ్చరించారు.
బువ్వ పెట్టనోడు ముఖ్యమంత్రా?
‘గురుకులాల్లో పసి బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టనోడు ముఖ్యమంత్రా? పిట్టల్లా చనిపోతున్న గురుకులాల విద్యార్థుల అంత్యక్రియల కోసం పోతుంటే అడ్డుకుంటున్నోడు ముఖ్యమంత్రా?’ అని దేశపతి మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలతో గోదావరి జలాల మళ్లింపు కోసం పత్రాలపై రేవంత్రెడ్డి సంతకాలు చేసిండు.. ఉల్టా కేసీఆరే అన్యాయం చేసిండని అబద్ధాలు వల్లిస్తున్నడు’ అని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా దేశపతి జై బోలో తెలంగాణ సినిమా పాటను పాడి సభికులను ఉత్తేజపరిచారు.