హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘ఏ బరాజ్ మూయకున్నా దేవాదుల తరహాలో కన్నెపల్లి పంపుహౌస్ నుంచి కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయవచ్చని నిపుణులే చెప్తున్నారు. అయినా నీ బుర్రకెక్కడం లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ శనివారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు. 1986లో గోదావరి నదికి 36 లక్షల క్యూసెకుల మహా వరద వచ్చినప్పుడే భద్రాచలానికి ఏమీ కాలేదని, 2022లో 24 లక్షల క్యూసెకుల ప్రవాహం వచ్చినా మేడిగడ్డ బరాజ్ నికరంగా నిలిచిందని గుర్తుచేశారు. అలాంటిది కేవలం 80 వేల క్యూసెకులకే భద్రాచలం కొట్టుకుపోతుందంటూ రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడికి నజరానా చెల్లించుకోవడం కోసమే తెలంగాణ రైతుల కడుపులు మాడ్చుతున్నాడని విమర్శించారు.
తెలంగాణవ్యాప్తంగా కరువు ఛాయలు కమ్ముకొని రైతులు కన్నీరు పెడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తన ఓటమి భయాన్ని, కుర్చీ ఊడుతుందనే అభద్రతాభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని, యావత్తు హిందూ సమాజం ఆరాధించే శ్రీరామచంద్రుడిని ఘోరంగా అవమానించారని విమర్శించారు. తన వ్యాఖ్యలను వెనకి తీసుకొని, శ్రీరాముడి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాసి పెట్టుకోండి రేవంత్‌రెడ్డి గారూ.. వచ్చే ఎన్నికల్లో కొట్టుకుపోయేది భద్రాద్రి క్షేత్రం కాదు, శ్రీరామచంద్రుడి రామబాణానికి బలికాబోయే మీ అహంకారపు కాంగ్రెస్ సామ్రాజ్యమే! ప్రజల కోర్టులో మీకు పరాభవం తప్పదు‘ అని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఉన్నదా?
‘2028లో జరుగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు 2029 మే-జూన్‌లో జరుగుతాయని రేవంత్‌రెడ్డి 36 నెలల ముందే జ్యోస్యం చెప్తున్నారు. అసలు ఎన్నికల తేదీలను డిసైడ్ చేయడానికి మీరేమైనా రాజ్యాంగేతర శక్తివా? లేక కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పనిచేస్తున్నదా?‘ అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం ఇకడ సీట్లు పెరుగుతాయని మురిసిపోతున్నారని, మోదీ-అమిత్ షాతో ఉన్న బంధం వల్లే ఈ రహస్యాలు తెలుస్తున్నాయా? అని నిలదీశారు. రాహుల్‌గాంధీ సిద్ధాంతాలను తొకిపెట్టి, మోదీ సిద్ధాంతాలను అమలు చేస్తున్న రేవంత్‌రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.