హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల విలువైన భూమిని కబ్జా చేసి, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి అప్పగించేందుకు కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ఆయన హెచ్‌సీయూ భూముల్లో జరుగుతున్న విధ్వంసంపై ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మసకబారుస్తూ, రియల్ మాఫియాకు అనుకూలంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యా సంసరణలను నిరోధిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేసేలా సీఎం చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక విద్యాసంస్థపై దాడి మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుకు తూట్లు పొడిచే చర్యగా అభివర్ణించారు. ఈ భూమిని రక్షించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం గతంలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసినప్పటికీ, ప్రభుత్వం తాజాగా కబ్జా చేయడానికి మరో కుట్ర మొదలుపెట్టిందని ఆరోపించారు.
సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొకిందని దుయ్యబట్టారు. ఒక జింకను వేటాడినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవించారని, హెచ్‌సీయూలో వందలాది నెమళ్లు, జింకలను హతమారుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాంటి శిక్ష పడాలి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండతోనే పోలీసులు హెచ్‌సీయూ విద్యార్థులపై లాఠీచార్జి చేశారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దమనకాండకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికైనా భూముల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.