హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టారని దుయ్య బట్టారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణంగా పంచాయ తీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా దాదాపు 90 శాతం ఫలితాలు ఉంటాయని, కానీ అందుకు భిన్నంగా ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ప్రలోభాలకు గురిచేసి, లొంగదీసుకునే ప్రయత్నాలు చేసినా తట్టుకుని, నిలబడిన అభ్యర్థుల మనోధైర్యానికి, స్ఫూర్తికి అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంతూరు పక్కన ఉన్న పొల్కంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారని దాసోజు ఎద్దేవా చేశారు. మంత్రి సీత క్క నియోజకవర్గం ఏటూరునాగారంలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడిందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ వదిన ఓడిపోయిందని చెప్పారు. ఆమెకు ఓట్లు పడకపోవడంతో, పంచిన డబ్బులు తిరిగివ్వాలని డి మాండ్ చేస్తూ, ఓటర్ల ఇండ్లు పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దాదాపు 550 మందికి డబ్బులు పంచితే, వారిలో కేవలం 55 ఓట్లు మాత్రమే వచ్చాయని మండిపడుతున్నారని తెలిపారు.
వచ్చే రెండు, మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రజలు ఇలాంటి ఫలితాలే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని శ్రవణ్ తెలిపారు. కాంగ్రెస్ వాళ్ల నుంచి తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటిని గ్రామీణ ప్రజలు దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా, ధైర్యంగా ఉండాలని సూచించారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుం దని భరోసా ఇచ్చారు.
దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని శ్రవణ్ విమర్శించారు. తన జల్సాల కోసం ఫుట్‌బాల్ చాంపియన్ మెస్సీతో మ్యాచ్ ఆడుతున్నాడని, ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. సింగరేణి డబ్బులను ఈ జల్సా మ్యాచ్‌కు మళ్లించారని ఆరోపించారు. హామీల అమలుకు డబ్బులు లేవు కానీ, ఇలాంటి జల్సాలకు మాత్రం ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన కోరికలు నెరవేర్చుకోవడం కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. అవి అందాల పోటీలైనా, ఓయూకు వెళ్లి మాట్లాడటమైనా, మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ అయినా.. తన కోరికల్లో భాగమేనని పేర్కొన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం సింగరేణి డబ్బులను ఎలా మళ్లిస్తారు? అని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ధర్నా చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్ పాల్గొన్నారు.