హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో దాడి చేయడం అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల దాడిని ఖండించారు. మాజీ మంత్రి హరీశ్‌రావును మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి మామిడి దివ్యను కిడ్నాప్ చేయడం నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి, కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఆయన విమర్శించారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావును సీఎం రేవంత్‌రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు తెరతీసిందని.. అత్యంత హేయమైన రీతిలో, దుర్మార్గంగా ఈ ఎన్నికలు సాగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఈ ఎన్నికలను ప్రహసనంగా మార్చివేశారని ఆగ్రహించారు. తెలంగాణ పాలకపక్షం విచ్చలవిడిగా నగదు పంచుతుంటే ఎన్నికల సంఘం, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విస్తృత స్థాయిలో మద్దతు లభిస్తున్నదనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. సీఎం మాట్లాడే భాషపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.