హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో పిల్లి, ఎలుకల్లా వ్యవహరించే కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో మాత్రం కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. కాషాయ కండువా కప్పుకొన్నవారు కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి సీఎం రేవంత్‌రెడ్డి మరో హిమంత బిశ్వశర్మ అవుతాడని భావించే బీజేపీ పెద్దలు సైతం వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై రెండు పార్టీలూ కలిసి కుట్రలకు దిగుతున్నాయని ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలతో మహానేతను బద్నాం చేసేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని నిప్పులు చెరిగారు. బుధవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, గోసుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు కురువ విజయ్‌కుమార్, కట్ల స్వామియాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో బీజేపీ నేత, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్ పీపీటీ ఇవ్వడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి కొమ్ముకాస్తూ బీఆర్ఎస్పై బురద జల్లారని విమర్శించారు. ప్రజంటేషన్లో పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆయన కోవలోనే సీఎం నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ ఆంధ్రాకు వత్తాసు పలుకడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇరిగేషన్‌పై అవగాహన ఉన్నదని చెప్పుకునే శ్రీరామ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
299 టీఎంసీల పాపం కాంగ్రెస్‌దే
కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కేటాయింపు పాపం ముమ్మాటికీ కాంగ్రెస్‌దేనని దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే కేటాయింపులు జరిగాయని స్పష్టంచేశారు. ఈ విషయం వెదిరె శ్రీరామ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. కానీ కేసీఆర్ కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని కేంద్రానికి 28 లేఖలు రాశారని గుర్తుచేశారు. కానీ శ్రీరాం తన పీపీటీలో ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పోరాటాన్ని విస్మరించారని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలపై చిత్తశుద్ధిలేని బీజేపీ కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు.. చంద్రబాబు మెప్పు కోసం ఆరాటపడుతున్నారని చురకలంటించారు. అందుకే శ్రీరాంతో పీపీటీ పెట్టించారని ఆరోపించారు. రేవంత్‌ను మెప్పించేందుకు తెలంగాణ బీజేపీ శాఖకు తాళం వేసుకున్నా తమకు అభ్యంతరమేమీలేదని, కానీ కేసీఆర్‌పై కుట్రలకు దిగితే సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఆంధ్రాకు శ్రీశైలం జలాలను అక్రమంగా తరలించేందుకు తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నది కేసీఆరేనని, ఆ ప్రాజెక్టును ఆపాలని గ్రీన్ ట్రిబ్యునల్‌కు 18 లేఖలు రాశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ మరమ్మతుపై జాప్యం చేస్తున్నదని, ప్రశ్నించాల్సిన ఉత్తర తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలి: పల్లె రవికుమార్
కొందరు కాంగ్రెస్ నేతల డైరెక్షన్లో బీఆర్ఎస్, కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిన మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడే వారికి బుద్ధిచెప్పేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టంచేశారు.