హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ) : యువ గ్రాడ్యుయేట్ల విద్యపై చేసే ఖర్చును ‘క్రిమినల్ వేస్ట్’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం అత్యంత దిగజారిన, అసహ్యకర చర్య అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులను, తెలంగాణ సమాజాన్ని ముఖ్యమంత్రి దారుణంగా అవమానించారని గురువారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. జెన్-జీ యువత చట్టసభల్లోకి రావాలని, నాయకత్వం వహించాలని ఉపన్యాసాలు దంచిన రేవంత్‌రెడ్డి, ఇవాళ మాట మార్చి విద్యార్థులను హేళన చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
అప్లికేషన్ నింపడానికి ఇబ్బందులు పడుతున్నారంటే, అది విద్యార్థుల వైఫల్యం కాదని, విద్యాశాఖ మంత్రిగా సీఎం పాలనలో విద్యావ్యవస్థ సాధించిన ఘోర వైఫల్యమని దుయ్యబట్టారు. సీఎం అనాలోచిత వైఖరి వల్ల ప్రైవేట్‌రంగంలో ఉద్యోగావకాశాలు కూడా నాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామీణ, పేద విద్యార్థులను ఎగతాళి చేసే ముందు, అధికారుల సహాయం లేకుండా ఇంగ్లిష్‌లో కనీసం ఒక చిన్న లీవ్ లెటర్ అయినా రాయగలరా అని సీఎంను ప్రశ్నించారు. తక్షణమే యువతపై నిందలు వేయడం మాని, విద్యావ్యవస్థను గాడినపెట్టాలని డిమాండ్‌చేశారు.