హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణలో యూరియా కొరత ఉన్నదని కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంకగాంధీతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తరు.. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రికి వినతిపత్రాలు ఇస్తరు.. రాష్ట్రంలోని మంత్రులు మాత్రం కొరత లేదంటూ బుకాయిస్తరు.. ఇదేం ద్వంద్వ విధానం.’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ శుక్రవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్సే ఎరువుల కొరత సృష్టిస్తున్నదని, ఆ పార్టీ కార్యకర్తలే చెప్పులు లైన్లో పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించిన వారే ఢిల్లీ వీధుల్లో ధర్నా ఎట్ల చేస్తరు? అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్సోళ్లవి పొంతలేని మాటలు, అసలు చెబుతన్నదేంటి? చేస్తున్నదేంటి? అని నిలదీశారు. రైతాంగాన్ని ఉద్ధరిస్తామని గద్దెనెక్కి ఆచరణలో అన్యాయం చేయడం బాధాకరమని ఎమ్మెల్సీ దాసోజు పేర్కొన్నారు.