హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తేతెలంగాణ): ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ భవిష్యత్తును వేలం వేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. 2025-26 ఆర్థిక సంవత్సర రుణపరిమితి రూ.54,000 కోట్లకు ఈ ఏడాది ఆగస్టు 31 నాటికే 33,415.15 కోట్ల రుణాలను సమీకరించి రాష్ర్టాన్ని అప్పులు ఊబిలోకి నెట్టారని సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం ద్వారా వచ్చే త్రైమాసికంలో మరో రూ.9,000 కోట్లు అప్పులు తేవాలని నిర్ణయించారని, ఇందుకు ఆర్బీఐ విడుదల చేసిన ప్రభుత్వాల బారోయింగ్ సూచికలే ఇందుకు నిదర్శనమని నిప్పులు చెరిగారు.
అక్టోబర్, నవంబర్లో రూ.2 వేల కోట్ల చొప్పున, డిసెంబర్లో రూ.5 వేల కోట్ల బాండ్ల వేలం ద్వారా రుణాలు తెచ్చేందుకు సర్కార్ సిద్ధమైందని ఆరోపించారు. సంపద సృష్టించి ఆదాయం పెంచుతామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఉన్న ఆస్తిని వంతుల వారీగా అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. దీర్ఘకాలిక అభివృద్ధిని పక్కనబెట్టి తాత్కాలిక నగదు ప్రవాహంపై దృష్టిపెట్టడం వారి అవగాహనా రాహిత్యమని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఆర్థిక మాయజాలంలో నిమగ్నమైందని విమర్శించారు.