హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక దళిత స్పీకర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అజమాయిషీ చెలాయిస్తున్నాడని విమర్శించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తానే రాజ్యాంగ సంరక్షకుడినని దేశమంతా చెప్పుకుంటూ తిరుగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాజ్యాంగాన్నే హననం చేస్తున్నా.. మౌనం వహించడం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు. కోర్టులు, రాజ్యాంగం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది భారత రాజ్యాంగం కాదని, అనుముల రాజ్యాంగమని ఎద్దేవా చేశారు. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకుండా సీఎం అడ్డం పడుతున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు వస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
‘రీజనబుల్ టైమ్’ అంటే, ఎంతకాలం?
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ‘రీజనబుల్ టైమ్’ అంటే ఎంతకాలం? ఎన్ని రోజులు? ఎన్ని వారాలు? అని శ్రవణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. స్పీకర్ అభ్యంతరకరంగా ఆలస్యం చేయడానికి కారణం ఏమిటి? అని నిలదీశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వారం రోజుల లోపుల చర్యలు తీసుకోకపోతే, అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది, కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారని సుప్రీంకోర్టు స్పీకర్‌ను హెచ్చరించడం తెలంగాణ ఎమ్మెల్యేలకు అవమానకరమని వ్యాఖ్యానించారు.
బీహార్‌లో ఓటు చోరీ.. ఇక్కడ ఎమ్మెల్యేల చోరీ
బీహార్‌లో ఓటు చోరీపై రాహుల్‌గాంధీ గగ్గోలు పెడుతుంటే, తెలంగాణలో ఎమ్మెల్యే చోరీ జరుగుతున్నదని శ్రవణ్ విమర్శించారు. దీనిపై రాహుల్ స్పందించకపోవడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ముకుల్‌రాయ్ బీజేపీ నుంచి గెలిచి, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినప్పుడు, వారిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది అని, అవే నిబంధనలు తెలంగాణలో కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు.
బోగస్ ఓట్లతో జూబ్లీహిల్స్‌లో గెలుపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బోగస్ ఓట్లతో గెలిచి సంబురాలు చేసుకుంటున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేలను దొంగిలించే చిల్లర రాజకీయాలకు దిగజారారు అని శ్రవణ్ విమర్శించారు. కాంగ్రెస్ తమ లోకసభ ఎన్నికల మ్యానిఫెస్టోలో 10వ షెడ్యూల్‌ను బలోపేతం చేస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు.