హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు సోషల్ మీడియా ఖాతా విషయమై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. హరీష్‌రావు సోషల్‌మీడియా అకౌంట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్‌ఫాలో చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్‌రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్సీ శ్రవణ్‌కుమార్ సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
అనంతరం మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీపై, బీఆర్ఎస్ నాయకులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు త్వరలో గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని, బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కాంగ్రెస్ నాయకుల దిమ్మతిరిగిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో కూడా అదే సభతో స్పష్టమైందని తెలిపారు. ఓవైపు బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుండటం, మరోవైపు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఎక్కువ అవుతుండటం చూసి జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ పార్టీ తమ నాయకులపై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు.