హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలంటూ విద్వేషపూరితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తక్షణం కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముఠాగోపాల్, దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ బీఆర్ఎస్ నేతలు సోమవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్‌కు వినతిపత్రం, ఫిర్యాదు కాపీ అందజేశారు. అనంతరం మీడియాతో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రా? లేక ఫ్యాక్షన్ ముఠా నాయకుడా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిగా అప్రజాస్వామిక ధోరణి, ఆయన వాడుతున్న ‘లూస్కానన్'(అదుపులేని) భాషపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ‘పాతిపెట్టండి’, ‘బొంద పెట్టండి’, ‘దిమ్మెలు కూల్చండి’ వంటి హింసాత్మక పదజాలం వాడటం చూస్తుంటే, ఆయనొక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని విమర్శించారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదని, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే పకా నేరపూరిత కుట్ర అని మండిపడ్డారు. అందుకే ముఖ్యమంత్రిపై కేసులు పెట్టాలని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సికింద్రాబాద్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై ఖాకీబుక్ ప్రకారం కేసులు పెట్టిన పోలీసులు.. హింసను ప్రేరేపించేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎందుకు కేసు పెట్టడంలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి శరీరం అధికారపార్టీ కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఆయన ఆత్మ మాత్రం టీడీపీలోనే ఉన్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని, లోపల తన పాత యజమాని చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేసిన టీడీపీని మళ్లీ లేపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఇది ఒకరకమైన ‘రాజకీయ వ్యభిచారం’ అని మండిపడ్డారు. ఢిల్లీ అధిష్ఠానానికి పంగనామాలు పెడు తూ ఇటు టీడీపీతో, అటు బీజేపీతో కోవర్ట్ సం బంధాలు నెరుపుతున్నారని విమర్శించారు. ఆయన తెలంగాణలో ‘ఓటుకు నోటు’ కేసులో దొరికిననాడే ఇక్కడ టీడీపీ భూస్థాపితమైందని పేర్కొన్నారు. తెలంగాణ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్‌ను, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీని తూలనాడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని హెచ్చరించారు.
పదేండ్లపాటు రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలించిన కేసీఆర్‌పై.. ముఖ్యమంత్రి హోదాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఖమ్మం సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, రెచ్చగొట్టేలా మాట్లాడినా ఆయనపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం అమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్‌ను 100 మీటర్ల లోతున పాతిపెడతానని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత రాజ్యాంగం సాక్షిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడం సరికాదని హితవు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాకేశ్, సర్వే యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.