Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రస్థాయిలో మంత్రుల ప్రవర్తన మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిసరనగళం ఎత్తినట్టుగానే, ఢిల్లీ అధిష్ఠానం వద్ద సీనియర్ మంత్రి ఒకరు ముఖ్యమంత్రిపై ధిక్కారస్వరం వినిపించినట్టు విశ్వసనీయ సమాచారం. పరిపాలనలో అనుభవ రాహిత్యంతో ముఖ్యమంత్రి తప్పటడుగులు వేస్తున్నారని, ఏకపక్ష ధోరణి నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని, జెండాలు మోసిన కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని సదరు మంత్రి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అధిష్ఠానం దూత కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో విడివిడిగా సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్రంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఎమ్మెల్యేల రహస్య భేటీ, పరిపాలనా తీరుతెన్నులు, సంక్షేమ పథకాల అమలు, కులగణన సర్వే, బీసీ జనాభా నివేదిక, ప్రతిపక్షాల మీద కేసులు, ప్రజల స్పందన తదితర అంశాలపై నేతల నుంచి విడివిడిగా సమాచారం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
మా నెత్తి మీద కూర్చోపెడితే ఆ బరువు మోయలేం
ఒక సీనియర్ మంత్రితో కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్న సందర్భంలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. సదరు అభ్యర్థి ఎంపిక ఏకపక్ష నిర్ణయమని, అందులో ఒక జిల్లా ఇన్చార్జిగా ఉన్న తనకు కనీస సమాచారం లేదని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. అదే స్థానం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి గానీ, పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలకు గానీ కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా రహస్య పద్ధతిలో అభ్యర్థి ఎంపిక జరిగిందని కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తల్లిదండ్రుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే విద్యా వ్యాపారిగా అతనికి పేరున్నదని, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తమ మీద రద్దుతున్నారని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. పార్టీతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి బలవంతంగా తమ నెత్తి మీద కూర్చోపెడితే ఆ బరువు తాము మోయలేమని, అతని అభ్యర్ధిత్వాన్ని అంగీకరించేది లేదని సదరు సీనియర్ మంత్రి తెగేసి చెప్పినట్టుగా తెలిసింది.
పసిగట్టకుండా మీరేం చేస్తున్నరు ఇద్దరు ఎంపీల మీద సీఎం గరంగరం
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో సీనియర్ మంత్రి ఆవేదనను సానకూలంగా విన్న కేసీ వేణుగోపాల్ తరువాత సీఎంతో భేటీలో ప్రధానంగా ఈ అంశంపైనే మాట్లాడినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ‘మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనే విషయాలు మీ వరకు వస్తున్నాయా? మధ్యలోనే ఆగిపోతున్నాయా?’ అని అడిగినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యేంత వరకు మీరు ఏంచేస్తున్నట్టు? తెలంగాణలో పాలనపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి నివేదికలు వస్తూనే ఉన్నాయి. పాలన ఇలా ఉంటే పార్టీ బతకదు’ అంటూ మందలించడంతో సీఎం తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిసింది. సహనం కోల్పోయిన ఆయన, తన అధికారిక నివాసానికి వచ్చిన తరువాత తన వెంట ఉన్న ఇద్దరు ఎంపీల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు సమాచారం. ఎవడెవడో వచ్చి అధిష్ఠానానికి రాంగ్ రిపోర్టులు ఇస్తుంటే మీరు ఏం చేస్తున్నారని మండిపడ్డట్టు తెలిసింది.