హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మక్కజొన్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నిరసన గళమెత్తింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శన నిర్వహించారు. మక్కజొన్న కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్య ధోరణిపై ధ్వజమెత్తారు. మక్క రైతులను ఆదుకోవాలని, రైతులకు రూ.500 బోనస్ ప్రకటించాలని వారంతా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మక్క రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. అనంతరం ఒకచేతిలో ప్లకార్డు, మరో చేతిలో మక్క జొన్న కంకి పట్టుకొని నినాదాలతో సర్కార్ వైఖరిని ఎండగట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి, మక్కజొన్న బస్తాను నెత్తిపై పెట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మక్కజొన్న రైతుల సమస్యలపై గన్‌పార్కు నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై మార్షల్స్, పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కేటీఆర్, హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి సహా ఇతర సభ్యులను అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులపై బడి వారి చేతుల్లో ఉన్న మక్క కంకులను బలవంతంగా లాక్కొని దౌర్జన్యం ప్రదర్శించారు.

మకజొన్న పంట దిగుబడులు మారెట్లకు రావడం మొదలై 15 రోజులు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు. గన్‌పార్కు వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. వరి పంట వేయవద్దని, పంట మార్పిడి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెబితే.. ఆ మాటలు నమ్మి రాష్ట్రంలోని రైతులు సుమారు 8 లక్షల ఎకరాల్లో మక సాగు చేశారని తెలిపారు.
తీరా పంట చేతికొచ్చాక ఆ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు. అకాల వర్షాలకు కల్లాలు, యార్డుల్లో ఆరబోసిన మక్క తడిసి రైతులు కన్నీరుపెడుతున్నారని తెలిపారు. మొకజొన్నకు మద్దతు ధర రూ.2,400 ఉంటే.. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బయట మారెట్లో దళారులకు కేవలం రూ.1,600 నుంచి రూ.1,700కే అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఊదరగొట్టిన పంటల బీమా ఊసే లేదని, రెండేండ్లుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ జాడే లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మద్దతు ధరకు మక్కలు కొనాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్,మార్చి 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మకజొన్న సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల డిమాండ్‌కు ప్రభుత్వం దిగొచ్చింది. తక్షణమే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టమైన ప్రకటన చేశారు. బుధవారం సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 5 మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం అందింది. మరో 200 కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
బుధవారం అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ శాసనసభ్యులు మక కంకులను చేతబట్టుకొని గన్పార్ వద్ద అసెంబ్లీ వైపు ర్యాలీగా బయలుదేరారు. మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఆందోళనతో ఎట్టకేలకు సర్కార్‌లో కదలిక వచ్చింది. మక్కజొన్న రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రావడం బీఆర్ఎస్ విజయమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం నుంచే కేంద్రాల్లో మక్కజొన్న కొనుగోలు ప్రారంభిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారని, ఈ అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తిన తర్వాతే సర్కార్‌లో కదలికలు వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రయత్నంతోనే మక్కజొన్న రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.