భద్రాచలం, జూన్ 6: ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని ఓ మహిళను అధికార పార్టీ నాయకుడు, భద్రాచలం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మోసం చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సంచలనం సృష్టించింది. ర్యాంపు ఇప్పించకపోగా.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు శనివారం అతడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు ముఖ్య అనుచరుడు ఓ మహిళ దగ్గర దాదాపు రూ.90 లక్షల వరకు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇసుక ర్యాంపు ఇప్పించకపోగా.. తీసుకున్న డబ్బులు సైతం ఇవ్వలేదు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అనుచరుడి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. తమకు రావాల్సిన రూ.90లక్షలు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. తాను ఒక మహిళనని, తన సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, ఈ విషయంపై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. న్యాయం చేయాల్సిన పెద్దలే పట్టించుకోకపోతే మేం ఎకడికి వెళ్లాలి?, మాకు న్యాయం జరుగకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతామని తెలిపారు.