మహబూబ్‌నగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ఎమ్మెల్యే ఆక్రోశం, ఆవేదన, అసహనం వెళ్లగక్కారు. ఇటీవల ఓ టీవీ చానల్ నిర్వహించిన చిట్‌చాట్‌లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, ప్రభుత్వలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ఎమ్మెల్యేలు చావులకు, శుభకార్యాలకు తప్ప గ్రామాల్లోకి వెళ్లడానికి జంకుతున్నారు’ అని యెన్నం కుండబద్దలు కొట్టడం అధికార పార్టీని ఇరకాటంలో పడేశాయి. ‘నిధులన్నీ పట్టణాలకే పరిమితమవుతున్నయి. మైగ్రేషన్ పెరుగుతున్నది. గ్రామాల్లో అశాంతి నెలకొన్నది. చిన్న సౌకర్యాలు కూడా గ్రామాలకు వెళ్లట్లేదు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గ్రామాలకు పోవడం లేదు. రూ.వేల కోట్లన్నీ పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమవుతున్నాయి. రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు? మేము గ్రామాల్లోకి పోయి రూ.లక్ష, రూ.రెండు లక్షల పని కూడా చేయలేకపోతున్నం.
మనం గ్రామాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంజెక్ట్ చేసి మినిమం రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మేధావులతో కలిసి చేస్తా ఉన్నం. దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా తయారవుతా ఉన్నది. కచ్చితంగా రూ.25 కోట్లు ఎమ్మెల్యే ద్వారా నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పెడితే అది కూడా నియమ, నిబంధనల ప్రకారం కలెక్టర్ ఆధీనంలో పెడితే 50 శాతం వివిధ శాఖల ఇబ్బందులు తొలగిపోతాయి. అధికారుల మీద ఉన్న ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఎమ్మెల్యేను ప్రజలతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తది.. అది సహజం. ప్రజావ్యతిరేకతను కూడా తొలగించాలంటే ఈ నిధులు కంపల్సరీగా నియోజకవర్గాల వారీగా కేటాయించాలి. ఇలా చేస్తే ప్రజా వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటది.
ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి పోవడానికి వెనకాడుతున్నరు. పెండ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు, సావులకు పోవడం తప్ప.. ఓ గ్రామానికి వెళ్లి ఇది సాంక్షన్ చేస్తున్న.. ఈ పని చేయండి అనే సాహసం ఏ ఎమ్మెల్యే కూడా చేస్తలేడు. ఒకవేళ నిజంగా ఈ ఫండ్ ఎమ్మెల్యేలకు అవైలబుల్గా ఉంటే నేను గ్రామాల్లోనే బస చేస్తా.. అన్ని వర్గాల ప్రజలను పిలుచుకొని గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి వెంటనే మంజూరు ఇచ్చే అవకాశం కలుగుతది. దాదాపుగా రెండు లక్షల 50 వేల కోట్ల బడ్జెట్లో 2 శాతం అంటే రూ.5 వేల కోట్లు ఏటా నియోజకవర్గాలకు కేటాయిస్తే అన్ని రకాల పనులు చేసే అవకాశం ఉంటది.
నేరుగా అవినీతి లేకుండా ఆ నిధులను దుర్వినియోగం కాకుండా ఖర్చు చేసుకోవచ్చు. దీనిమీద చాలా సీరియస్‌గా ఉన్నం. ఎమ్మెల్యేలు అందరూ ఈ ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు. ఇది కావాలి అని అనుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే సమస్య కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఆ వెసులుబాటు ప్రతి ఒక్కరికీ కావాలని చెప్పి ఎమ్మెల్యేలంతా కోరుకుంటున్నారు’ అంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సొంత జిల్లా నుంచి సీఎంకు వ్యతిరేకత వస్తుండటంతో ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పాలమూరు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత తీవ్ర రూపం దాలుస్తుండటంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.