భీమ్‌గల్, ఫిబ్రవరి 6: దొంగ హామీలతో మోసగించిన రేవంత్‌రెడ్డికి, అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో భీమగల్లో రూ.వంద కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తే కాంగ్రెస్ వచ్చాక వాటిని నిలిపి వేసిందని ఆరోపించారు. రైతు రుణమాఫీ అందరికీ కాలేదని, రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి పాత రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పుట్టి హామీలను అమలుచేస్తుందని తెలిపారు.