నాగిరెడ్డిపేట, మే 30: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నట్టు తెలిపారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వారి ఉసురు తప్పకుండా తగులుతుందని హెచ్చరించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద, కన్నారెడ్డి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 80 శాతం ధాన్యం కొన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటన పూర్తిగా అవాస్తమని అన్నారు. క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్టు వేముల మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యమంతా కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నదని తెలిపారు. ధాన్యం కొనే దిక్కులేక, కేంద్రాల్లో ఇబ్బందులు తట్టుకోలేక రూ.2900 ధర వదులుకుని, కేవలం రూ.1700కు రైతులు తమ వడ్లను దళారులకు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. జొన్న కొనుగోళ్లపై ఆంక్షలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
చేతకాని ప్రభుత్వమిది..
పంట కోసి రెండు నెలలు గడుస్తున్నా అనేక చోట్ల ధాన్యం తూకం వేయడం లేదని వేముల మండిపడ్డారు. కాంటా వేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిల్లులకు పంపిన లారీలు ఖాళీ కావడానికి వారం రోజులు పడుతుందని, వారం రోజులుగా లారీల్లో ధాన్యం ఉందన్న సాకుతో మిల్లర్లు కోత విధిస్తున్నారని ఆవేదన చెందారు. రైతు వద్ద నుంచి ధాన్యం కొనడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వేముల డీఎస్వోకు ఫోన్ చేసి, వెంటనే ధాన్యం కాంటా వేయాలని, లారీల సంఖ్య పెంచి బస్తాలు తరలించాలని కోరారు. లేకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
బావుల వద్ద మీటర్లకు సర్కార్ కుట్ర ; మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు కోస్తున్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. బావుల వద్ద మీటర్లు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెడితే ఊరుకునేది లేదని, రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సమావేశంలో వేముల మాట్లాడారు. రైతుల కోసం నాడు కేసీఆర్ మీటర్లు పెట్టకుండా రూ.30 వేల కోట్లు వదులుకున్నారని, నేడు రేవంత్‌రెడ్డి మోదీ అడిగిందే తడువుగా మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యాడని నిప్పులు చెరిగారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమావేశంలో విద్యుత్తు అధికారి శశాంక్.. లెక్కల కోసం, ఎంత విద్యుత్తు సరఫరా అవుతుందో తెలుసుకోవడానికే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతున్నామని చెప్పడాన్ని తప్పుబట్టారు.