వేల్పూర్, జూన్ 1 : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో రోడ్లపై వర్షాలకు తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని అక్కడి రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో కల్లాలు, రోడ్లపై వడ్లు అలాగే ఉండటంతో అకాల వర్షాలకు తడిసి మొలకలు రావడంతో పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యాన్ని అటు ప్రభుత్వం ఇటు వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో కిలో నాలుగైదు రూపాయలకు విక్రయించుకుంటున్నారని తెలిపారు.
అందాల పోటీల కోసం ఎనిమిదిసార్లు అధికారులతో సమీక్ష చేసిన సీఎం రేవంత్‌కు.. పంటల కొనుగోలుపై సమీక్ష చేసే సమయం లేదా అని ప్రశ్నించారు. తడిసిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారమే కొనుగోలుకు చివరిరోజు అని అధికారులు అంటున్నారని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వేముల వెంటనే కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి పడగల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మరో నాలుగు రోజులు కొనసాగించి పూర్తి ధాన్యం కొనుగోలు అయ్యేలా చూడాలని కోరారు. సోమవారం నుంచి వడ్లు కొనుగోలుచేయబోమంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్న ఐకేపీ అధికారిని ఎమ్మెల్యే మందలించారు.