నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ డిస్కంలు వివిధ కారణాలు చెప్పి18,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైంది. రూ.963 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు, రూ.16,364 కోట్ల విద్యుత్ ఛార్జీలు(Electricity charges) ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు కోసం విద్యుత్ సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని వెంటనే తిరస్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula)డిమాండ్ చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈ.ఆర్.సి(విద్యుత్తు నియంత్రణ మండలి) గురువారం నిజమాబాద్ కలెక్టరేట్ చేపట్టిన బహిరంగ విచారణలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, విజి గౌడ్ తదితరులు పాల్గొని కమిషన్ సభ్యుల ముందు తమ వాదనలు వినిపించారు. ఈ వసందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు ఫిక్స్‌డు ఛార్జీని ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తుండగా దాన్ని రూ.50 కి పెంచాలని డిస్కంలు కోరటం సరికాదన్నారు.
ఇటీవల కాలంలో విద్యుత్ వినియోగం అనేది చాలా పెరిగిపోయింది. ఎండాకాలం వచ్చిదంటే చాలు 300యూనిట్ల విద్యు త్ వినియోగం సాధారణమైందని పేర్కొన్నారు. ఇది ప్రజలపై పెను భారం మోపుతుంది. వారిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. 300 యూనిట్లు పై వాడే మధ్య తరగతి ప్రజలకు దీనివల్ల ప్రతి నెల వేల రూపాయల భారం పడుతుంది.
ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించటం సమంజసం కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించిందని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్‌ణు కేవలం ఒక వ్యాపార వస్తువుగా చూడటం దురదృష్టకరమన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నారు.