నిర్మల్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ అహంభావానికి ఎదురుదెబ్బ తగిలింది. అధికారం తన చేతిలోనే ఉన్నదని, తాను ఏది చెబితే అది చెల్లుబాటవుతుందని భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వ్యూహానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పకడ్బందీగా చెక్ పెట్టింది. కౌన్సిలర్లను కొనేందుకు ఎమ్మెల్యే వేసిన ఎత్తుగడను బీఆర్ఎస్ చిత్తుచేసింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలకు గాను.. బీఆర్ఎస్ 4, బీ జేపీ 4, కాంగ్రెస్ 3 సీట్లను దక్కించుకోగా, ఒక రు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. మొదట్లో 3 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ తనకున్న అధికార బలంతో దొడ్డిదారిన చైర్మన్ పదవిని దక్కించుకోవాలని పథకం వేసింది. స్వతంత్ర కౌన్సిలర్‌కు భారీ ఆఫర్ ఇచ్చి కాంగ్రె స్ కండువా కప్పడమే కాకుండా, గెలుపొందిన ముగ్గురు కౌన్సిలర్లతో శిబిరానికి తరలించారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లను సైతం కొనుగోలు చేసేందుకు యత్నించినట్టు ఆరోపణలున్నాయి. చైర్మన్ పదవి తనకు ప్రతిష్ఠాత్మకమే కాకుండా, తన డీసీసీ అధ్యక్ష పదవికి స వాల్‌గా మారిందని ఎమ్మెల్యే బొజ్జు భావించా రు. అయితే ఎన్నికల్లో అధికార పార్టీని వెనక్కి నెట్టి బీఆర్ఎస్, బీజేపీలు నాలుగేసి స్థానాలు దక్కించుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఎమ్మెల్యే వ్యూహాలను గమనిస్తూ కాం గ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం దక్కనీయకుండా ఉండేందుకు బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటయ్యాయి. ఈ కూటమి వ్యూహానికి బీఆర్ఎస్ నేతృత్వం వహించి ఎలాగైనా ఎమ్మెల్యే అహంకారాన్ని అణచాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
చైర్మన్ ఎన్నిక కోసం శనివారం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయగా, అందరికంటే ముందుగా ఉదయం 11గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తమ పార్టీకి చెందిన ము గ్గురు కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్తోపాటు ప్రలోభ పెట్టి కొనుగోలు చేసిన బీఆర్ఎస్ మ హిళా కౌన్సిలర్‌ను వెంట బెట్టుకొని మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు బీఆర్ఎస్, నలుగురు బీజేపీ కౌన్సిలర్లు కూడా అక్కడికి చేరుకున్నారు. అధికారు లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. మొదట చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించగా, బీఆర్ఎస్ మద్దతు పలికిన బీజేపీ అభ్యర్థి అంకం మౌనికకు ఏడుగురు కౌన్సిలర్లు మద్దతు పలికారు. మొత్తం 12మంది కౌన్సిలర్లకు ఏడుగు రు మద్దతివ్వడంతతో ఇక అందరూ ఆమె గెలుపు ఖాయమైందనుకున్నారు. ఈ దశలో కాంగ్రెస్ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడంతో వారి వైపు కూడా అధికారులు ఎన్నిక నిర్వహించారు.
వారి వైపు ఎక్స్ అఫీషియో సభ్యు ని హోదాలో ఎమ్మెల్యే బొజ్జుతోపాటు ఆరుగురు చేతులెత్తారు. అదే సమయంలో ఓ కౌన్సిలర్‌ను గందరగోళ పరిచి ఆమె ద్వారా బలవంతంగా చేయిని పైకి ఎత్తించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. తమ పార్టీకే ఏడుగురు మద్దతు ఇచ్చారంటూ ఎమ్మెల్యే ఎన్నికల హాల్లోనే అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో సహనం కోల్పోయి అధికారులపై మండిపడుతూ గందరగోళం సృష్టించారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ అక్కడే ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు అడ్డుకొని ఏడుగురు కౌన్సిలర్ల మద్దతు తమవైపు ఉన్నట్టు నిర్ధారణ అయినందున ఫలితం ప్రకటించాలని పట్టుపట్టారు. దీంతో దాదాపు రెండు గంటలపాటు ఎన్నికల హాల్లో హైడ్రా మా కొనసాగింది. ఎమ్మెల్యే అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఫలితం ప్రకటించకుండా అడ్డుకోవడమే కాకుండా, ఎన్నికను మరుసటి రోజైన ఆదివారం నాటికి వాయిదా పడేలా చేశారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీలు నిర్మల్ కలెక్టర్ అభిలాషా అభినవ్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ఖానాపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నా యకులు, పార్టీ శ్రేణులు ఆదివారం ఖానాపూర్‌కు తరలిరావాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడి కక్కడ గృహ నిర్బంధం చేశారు.
కాంగ్రెస్ పార్టీ శనివారం సాగించిన రసాభాసపై బీఆర్ఎస్, బీజేపీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం నిర్వహించిన ఎన్నికకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగా, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చిన వెంటనే అధికారులు ఒత్తిళ్లను పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక ఏడు ఓట్లతో గెలుపొందారు. కాగా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. వైస్ చైర్మన్‌గా షోయబ్ హుస్సేన్ ఎన్నికయ్యారు. రెండు రోజులపాటు ఎమ్మెల్యే బొజ్జు చేసిన అప్రజాస్వామిక చర్యలన్నీ అపహాస్యం పాలయ్యా యి. ఆయన తీరును రాజకీయ పార్టీలే కాకుండా ప్రజాస్వామిక వాదులు, మేధావులు బహిరంగంగానే ఖండించారు.