భద్రాచలం, అక్టోబర్ 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అంటూ అసెంబ్లీ స్పీకర్ ఎదుట వాదనలు వినిపిస్తూ.. నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. భద్రాచలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, సీనియర్ నాయకులతో కలిసి మంగళవారం పాల్గొన్న ఆయన.. అనంతరం జరిగిన రక్తదానం శిబిరం, అన్నదాన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ ఫొటోలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో అసలు తెల్లం బీఆర్ఎస్లో ఉన్నారా.. కాంగ్రెస్లో ఉన్నారా.. ప్రజలకు చెప్పాలి అంటూ చర్చలు జరగడం గమనార్హం. మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య వర్గం దూరంగా ఉంది. దీంతో ఎమ్మెల్యే తెల్లం, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అనుచరుడిగా పేరున్న పొదెం వీరయ్య భద్రాచలంలోనే ఉండి.. ఈ వేడుకలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.