Peddagattu | పెద్దగట్టు ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే జరిగిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లి సమీపంలో జరుగుతున్న పెద్దగట్టు జాతరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి యాదవ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తలసాని లింగమంతుల స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ నిర్వాహకులు తలసానిని సత్కరించి.. జ్ఞాపిక అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత.. తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండో పెద్ద జాతర పెద్దగట్టు జాతరని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారన్నారు.
వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రూ.14కోట్లు మంజూరు చేసి.. అనేక అభివృద్ధి పనులు చేపట్టి.. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జాతర నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5కోట్ల మంజూరు చేసినట్లు ప్రకటించిందన్నారు. ఇందులో ఎన్ని ఖర్చు చేశారని ప్రశ్నించారు. జాతర నిర్వహణ ఏర్పాట్లు సక్రమంగా లేవని, పారిశుధ్యం నిర్వహణ సరిగా లేకపోవడం దుర్వాసనతో భక్తులు ఇబ్బందులుపడుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 20 వరకు జాతర జరుగుతుందని.. ఈ రోజు నుంచైనా భక్తులకు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గుప్తా, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌తో పాటు పలువురు యాదవ సంఘాల నేతలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.