హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన అందించారని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ సభకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి గులాబీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ భవన్లో మంగళవారం ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి, అనేక పోరాటాలు చేసి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ గొప్ప పరిపాలనాదక్షుడని పేర్కొన్నారు. ఉద్యమ సారథే తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణ వేగంగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. పదేండ్లలో జరిగిన అభివృద్ధి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్‌లో ఈనెల 27న జరగనున్న భారీ బహిరంగ సభకు గ్రేటర్ నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక పండుగ తమ ఇంట్లో పండుగగా ప్రతీ కార్యకర్త భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వరంగల్ సభ విజయవంతం చేయడంలో భాగంగా గ్రేటర్‌లోని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. నేడు, రేపు గోషామహల్, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ శ్రవణ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరుగుతుందని వెల్లడించారు. 13న నియోజకవర్గాల స్థాయిలో మీటింగ్ ఉంటుందని, 20న తెలంగాణ భవన్లో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని చెప్పారు. 27న ప్రతీ డివిజన్లో గులాబీ జెండా ఎగురవేసి వరంగల్‌కు బయల్దేరనున్నట్టు పేర్కొన్నారు.