హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే(Caste survey) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందని, ప్రభుత్వం కూడా అబాసు పాలవుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani)విమర్శించారు. సోమవారం ఆయన బన్సీలాల్ పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులాల వారీగా జనాభాను గుర్తించేందుకు చేపట్టిన కుల గణన సర్వేకు 75 అంశాలతో కూడిన ప్రొఫార్మా ఎందుకని ప్రశ్నించారు. సర్వే కోసం వెళ్లే ఎన్యుమరేటర్లు సైతం ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు.
సర్వేలో అడుగుతున్న వివరాలను చూసి ప్రజలు అవాక్కు అవుతున్నారని చెప్పారు. ఈ సర్వే వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని, కేవలం కాలయాపన, ప్రజలను మభ్య పెట్టేందుకే సర్వే చేపట్టినట్లు ఉందని విమర్శించారు. పొంతనలేని సమాచారం అడుగుతుండటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్వేను వ్యతిరేకిస్తున్నారని వివరించారు. నాడు కేసీఆర్ ఆధ్వర్యంలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. సర్వే పూర్తి కాకుండా, బీసీ రిజర్వేషన్లు తేల్చకుండా సర్పంచ్ ఎన్నికలపై ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు.