నర్సాపూర్, ఫిబ్రవరి 16: జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అనైతిక పొత్తు పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడు తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాల క్ష్మారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అనైతిక పొత్తుతో పదవులు దక్కించుకున్నాయని విమర్శించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మీడియాతో మాట్లాడారు. నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గందరగోళ పరిస్థితిని సృష్టించాయని మండిపడ్డారు. రాష్ట్రంలో బడే భాయ్.. చోటే భాయ్ అనే మాట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పొత్తుతో తేటతెల్లమైందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని మాట్లాడే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరు ఏమిటో ప్రజలకు తేలిపోయిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల అనైతిక పొత్తును ప్రజలు హర్షించరని పేర్కొన్నారు.