శివ్వంపేట, మే 17 : ధాన్యం కొనరు, లారీల కొరత తీర్చరూ ఇదేం సర్కార్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. లారీల కొరతతో ధాన్యం కాంటా చేస్తలేరని, ధాన్యం తరలించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల, చెన్నాపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రైతులు వరిధాన్యం కాంటా వేశాక అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైస్‌మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు రైతులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు. అదనపు కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. రైతులుధాన్యం కాంటా వేయగానే ట్రక్‌షీట్ ఇవ్వాలని, రైస్‌మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వడ్లన్నీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయని, వానొస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.