హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఈడీ విచారణలో ఏం జరిగిందో బీజేపీ నాయకులకు ఎలా తెలిసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రశ్నించారు. ఈడీ అధికారులు బీజేపీ నాయకులకు విచారణ విషయాలు చెప్పారా? ఆ పార్టీ నేతలతో చర్చ జరిపిందా? అని అనుమానం వ్యక్తం చేశారు. తాము ఇన్ని రోజులు చెప్తున్నట్టు ఈడీ బీజేపీ జేబు సంస్థ అనటానికి ఇదే నిదర్శనమని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితి ఉన్నదని వెల్లడించారు. బీజేపీలో మోదీకే కాదు చాలా మందికి భార్యలు లేరని, అందుకే మహిళలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, కోరుకంటి చందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ కవితపై కాదని, తెలంగాణపై దాడిగా ప్రజలు చూస్తున్నారని సైదిరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత కవితది అని వివరించారు.
బీజేపీ ఒక సైకో పార్టీ అయిందని, సైకోలు అందరూ ఒక గ్రూప్‌గా మారి బీజేపీలో కలిశారని విమర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ బీజేపీ దేశంపై పడి దోచుకు తింటున్నదని, ఎన్నికలు రాగానే శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించినట్టు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. మహిళా లోకం చెప్పుతో కొట్టే పరిస్థితిని బండి సంజయ్ తెచ్చుకొన్నారని ధ్వజమెత్తారు. తాను మాట్లాడింది తెలంగాణ మహిళలంతా చూశారని, తాను ఎకడా తప్పు మాట్లాడలేదని, బండి సంజయ్‌కి కౌంటర్‌గా మాట్లాడానని వివరణ ఇచ్చారు. సంజయ్ క్షమాపణ చెప్తే తాను కూడా క్షమాపణ చెప్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం తీవ్రమైన అన్యాయం చేసిందని విమర్శించారు. తాము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేశామని, తమ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఉరుకొనేది లేదని హెచ్చరించారు.