రంగారెడ్డి, (నమస్తే తెలంగాణ) ఏప్రిల్ 8: కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదికాదని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశం శంషాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు తరలివచ్చే వారికోసం బస్సులు సిద్ధంగా ఉంటాయని, ప్రజలను సభకు తరలించడంతోపాటు తిరిగి వారిని ఇంటికి చేర్చే బాధ్యతను ఆయా గ్రామాల నాయకులు తీసుకోవాలని కోరారు.