MLA Sabitha | బడంగ్‌పేట, ఫిబ్రవరి 25 : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈనెల 18న ఉదయం 9 గంటలకు రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ మండల కేంద్రంలో నిర్వహించే రైతు ధర్నా కార్యక్రమానికి వేలాదిగా తరలిరావాలని కోరుతూ జిల్లెలగూడలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
సరూర్‌నగర్ డివిజన్, ఆర్కేపురం డివిజన్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, మహేశ్వరం, కందుకూరు మండలాలకు సంబంధించిన నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు తుక్కుగూడకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. తుక్కుగూడ నుంచి భారీ ర్యాలీగా ఆమనగల్ రైతు ధర్నాకు రావాలని కోరారు. తుక్కుగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదగా గులాబీ జెండాను ఎగరవేసి అక్కడి నుండి ర్యాలీగా వెళ్లాల్సి ఉంటుందని ఆమె తెలియజేశారు.
రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూములను రోడ్ల పేరుతో, త్రిపుల్ ఆర్ పేరుతో, గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో, కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోవడం దారుణం అన్నారు. రైతులు వ్యవసాయం చేసుకుంటున్న రెండెకరాలు, మూడు ఎకరాలను తీసుకుంటే రైతులు ఎలా బతకాలని ఆమె ప్రశ్నించారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. రైతుల సమస్యలపైన ఎక్కడ సమావేశం పెట్టిన రైతులు తండోప తండాలుగా తరలివస్తున్నారని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని ఆమె స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకున్నదని ఆమె ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అర్కల కామేష్ రెడ్డి, రామిడి రామ్ రెడ్డి, అర్జున్, పవన్, అశోక్, రాజు నాయక్,రవి నాయక్, అనిల్ కుమార్ యాదవ్, యాదగిరి, సిద్దాల లావణ్య బీరప్ప, జంగా రెడ్డి, తదితరులు ఉన్నారు.