హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులే రోడ్డెక్కాల్సిన దుస్థితి రాష్ట్రంలో తలెత్తిందని బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు సిబ్బంది రోడ్డెక్కి ధర్నాలు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని నిలదీశారు. హోంమంత్రి లేక ఎవరికి చెప్పాలో తెలియక పోలీసు లు ఆందోళనలు చేయడం ముఖ్యమంత్రి వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా మార్పు అంటే? అని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో శనివారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
నల్లగొండ, వరంగల్, డిచ్పల్లి బెటాలియన్లలోని కానిస్టేబుళ్ల భార్యలు చంటిపిల్లలను చంకనవేసుకొని, తమకు న్యాయం చేయాలని ఆందోళనలుచేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఐదు రోజులైనా ప్రభుత్వం నుంచి పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి కానిస్టేబుల్స్ సచివాలయాన్ని ముట్టడించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. పోలీసుల భార్యల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నట్టు చెప్పారు. బెటాలియన్ కానిస్టేబుళ్లను పిలిచి పరిష్కరించి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమని విమర్శించారు.
హోంశాఖను నిర్వహిస్తు న్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వల్లే పోలీస్ కుటుంబాలు చిన్నపిల్లలతో రోడ్లపై ఆందోళన చేయాల్సి వచ్చిందని అన్నారు. పోలీసులు రోడ్డు ఎకడం చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. హోంమంత్రి లేకపోవ టం వల్ల కానిస్టేబుల్స్ యూనిఫాం వేసుకొని ధర్నాలు చేయాల్సిన దుస్థితి తెలంగాణలో దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్డర్లీ వ్యవస్థను తీసివేసినప్పటికీ పోలీసులతో ఇండ్లలో వివిధ పనులు చేపిస్తున్నట్టు వారి భార్యలు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ మాట నిలబెట్టుకోవాలని డిమాం డ్ చేశారు. 18 రోజులకు 4 రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధ్దతిని కొనసాగించాలని అన్నారు. డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిషరించాలని కోరారు. తద్వారా 13 బెటాలియన్లు 8-10 వేల మంది మంది కానిస్టేబుళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
పోలీసుల ఆందోళనలు ఇదే తొలిసారి: సునీతాలక్ష్మారెడ్డి
కేసీఆర్ సంపాదించి పెట్టిన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను రేవంత్‌రెడ్డి దెబ్బతీయెద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. మూడు నెలలకు ఒకసారి బదిలీ చేస్తే పోలీసుల కుటుంబాలు ఏమైపోతాయని, పిల్లల చదువులు ఏం కావాలని నిలదీశారు. కానిస్టేబుళ్ల సమస్యలు పరిష్కరించి, వారి కుటుంబాల్లో భరోసా నింపాలని అన్నారు.
మనసు కలిచివేస్తున్నది: వాణీదేవి
పోలీస్ వ్యవస్థలో నెలకొన్న దీనస్థితిని చూస్తుంటే మనసు కలచి వేస్తున్నదని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు.కానిస్టేబుళ్ల భార్య లు, కుటుంబసభ్యులు ధర్నాలు చేసిన ఘటన ఎకడా ఉండబోదని చెప్పారు. కుటుంబసభ్యులతో వారు ఉండకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. వారు ప్రశాంతంగా ఉంటేనే డ్యూటీ బాగా చేయగలుతారని చెప్పారు.