బడంగ్‌పేట, జనవరి 9: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కేసు పెట్టారని మాజీ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం మండలంలోని పడమటి తండా నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్ములా-ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేసినా సీఎం రేవంత్‌రెడ్డి సమయం ఇవ్వలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని ఉద్ఘాటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ నోరెత్తితే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్పంచుల బిల్లులు మంజూరు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త రేషన్‌కార్డులను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. పాలనను గాలికొదిలేసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాకోర్టులో ఆయనకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండు యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, పోచారం సుధాకర్‌రెడ్డి, అంభయ్య యాదవ్, అనుమగల్ల చంద్రయ్య, కర్రోల చంద్రయ్య, నవీన్, అనిత రవి నాయక్, కాటమన్ ప్రభాకర్, లింగం, రాజు నాయక్, రాజేష్, పాండు, దేవుల నాయక్ తదితరులు పాల్గొన్నారు.