మణికొండ, జూన్ 14: ‘కేసీఆర్ అంటేనే చరిత్ర.. ఆయన తెలంగాణ ఊపిరి.. అలాంటి కేసీఆర్ నిషాన్‌ను ఎవరూ చెరిపేయలేరు.. అది ఎవరి తరమూ కాదు’ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘గుడ్ మార్నింగ్ మణికొండ -ప్రజాభిప్రాయ సేకరణ’ కార్యక్రమ శత దినోత్సవ వేడుకలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ది ఏదని ప్రశ్నిస్తే.. సీఎం రేవంత్ అక్రమ కేసులను పెట్టి వేధించాలని చూస్తున్నారని విమర్శించారు. నిజంగా అభివృద్ది చేస్తే అక్రమ కేసులెందుకని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ పేరెత్తందే పూట గడపడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు రేవంత్ సిద్ధమా? లేదంటే లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను దూషించేందుకు బీజేపీ-కాంగ్రెస్ జట్టుకట్టి బడేభాయ్-ఛోటేభాయ్ పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ సర్కారు ప్రజావ్యతిరేక పాలనపై బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్లను బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తామన్న ఓ మంత్రి వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లను గాంధీభవన్ నుంచి ఏమైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అర్హుడైన ప్రతి ఒక్కరికీ సర్కారు పథకాలను అందజేయడం సర్కారు భాధ్యత.. మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పేరు దిగజార్చేందుకు కుట్రలు
కేసీఆర్ పేరును దిగజార్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కుట్రలు చేస్తున్నదని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఆనాడు సీఎంగా కేసీఆర్ ఓ విజన్‌తో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే.. దానిపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుపై యావత్తు తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనకు కాలం చెల్లిందని చెప్పారు. చదువురాని అమ్మలు కూడా సీఎం రేవంత్‌రెడ్డిని ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని, ఏడాదిన్నర కాలంగా ఈ సర్కారు ఏమీ చేయలేదని తిట్ల వర్షం కురిపిస్తున్నారని చెప్పారు.