Sabita Indra Reddy | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గుండె ల నిండా బాధతో ఆమె కండ్లు చెమర్చగా గొంతు తడబడింది. నిర్భయంగా మాట్లాడే ఆమె.. గద్గదస్వరంతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వయం గా ఆమే వెల్‌లోకి దూసుకొచ్చారు. ఒక దశలో సభలో కింద కూర్చొని నిరసన తెలిపారంటే ఆమె ఎంత నొచ్చుకున్నారో అర్థమవుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘వెనుక కూర్చున్న అక్కల్ని నమ్ముకోవద్దని కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సూచన చేశారు. అంటే మేం ఏం మోసం చేశాం? ఏం ముంచినం? ఈయన్ను ముంచినమా? ఆనాడు కాంగ్రెస్‌లోకి వస్తే ఆశాకిరణం అయితవని చెప్పి, బతిమిలాడి పార్టీలోకి అహ్వానించానో లేదో సీఎం రేవంత్‌రెడ్డి గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలి.
నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్? ఏం మోసం చేశాం? ఇప్పుడే కాదు.. ఎన్నికల సమయంలోనూ ఇదేవిధంగా వ్యవహరించారు. నా నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చి సబితక్క పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతదని అన్నారు. ఏం మాట్లాడినం? ఎవర్ని అవమానిస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు అవమానిస్తున్నా వ్? ఎందుకు కక్ష? ప్రతిసారి ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్? మాపై చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. ఈ రోజు సీఎం ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో చేరారు? రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి నా ఇం టిపై వాలితే కాల్చి పడేస్తానన్నారు. అలాంటిది ఇప్పు డు కాంగ్రెస్‌లో ఎంతమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారో చెప్పాలి. వారిని ఎలా చేర్చుకున్నారో చెప్పాలి.
నాపై అందరూ మాట్లాడుతుంటే సీఎం ఎం జాయ్ చేస్తున్నారు. ఆ రోజు ఆయన కాంగ్రెస్‌లోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా నేను ఆయనను ఆశీర్వదించిన. బాబు నువ్వు పెద్దగా ఎదుగుతావు.. ఈ రాష్ర్టానికి సీఎం అవుతావు అని ఆహ్వానించిన. అ లాంటి నాపై రేవంత్‌రెడ్డి ఎందుకు కక్షగట్టారో అర్థం కావడంలేదు. ఒక ఆడబిడ్డకు బాధ అయితుంటే వినే స్థితిలో లేరా?’ అని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశా రు. నిండు సభలో ఒక మహిళ కన్నీరు కార్చడంతో సభ మొత్తం గంభీరమైన వాతావరణం నెలకొన్నది.
తలవంచుకోవాల్సిన సందర్భమిది
‘కాంగ్రెస్‌లోకి రేవంత్ రాకముందే ఆ పార్టీకి మేం సేవలు అందించాం. భుజాన జెండా వేసుకొని కాంగ్రెస్ కోసం కష్టపడ్డాం. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని నేను కూడా కోరుకున్నా. నేను, సునీత పార్టీని మోసం చేశామని రేవంత్ మాట్లాడారు. రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరటమే నేను చేసిన తప్పు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని వచ్చారని ఎలా అంటారు? ఇది రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు తగులుతుంది’ అంటూ భావోద్వేగానికి గురైన సబిత కంటతడి పెట్టుకున్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు రాగా, కాంగ్రెస్ నేతలు అక్కడే ఎక్కువసేపు ఉండటంతో పక్కనే మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలు క్షేమం కోరుకుంటారని, నమ్మినవారికి ప్రాణం ఇస్తారని తెలిపారు.
అసెంబ్లీలో జరిగిన అవమానం సునీ త, సబితకు మాత్రమే కాదని, యావత్తు తెలంగాణ ఆడబిడ్డలకు అని చెప్పారు. అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమానపరిచే పరిస్థితి వచ్చిందంటే నిజంగా తలవంచుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. సభలో జరిగిన దానిపై ప్రతిఇంట్లోని ఆడపిల్లలు ఆలోచిస్తున్నారని అన్నారు. 24 ఏండ్ల్ల నుంచి తాను అసెంబ్లీకి వస్తున్నానని, సీఎం పీఠంపై చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌ను చూశానని సబితారెడ్డి తెలిపారు. ఈ రోజు సీఎం పీఠంపై రేవంత్‌రెడ్డిని కూడా చూస్తున్నానని, నిండు సభలో మహిళలపై అనుచితంగా మాట్లాడి సీఎం పీఠాన్నే రేవంత్ అగౌరపరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభలో కేటీఆర్ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, ఆ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని, తనతోపాటు మహిళలందరిపై సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే: సునీతాలక్ష్మారెడ్డి
అసెంబ్లీలో రాష్ట్ర మహిళలను అగౌరవపరిచేలా, కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాం డ్ చేశారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. నిండు సభలో ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగితే, నేడు అసెంబ్లీలో రాష్ట్ర మహిళలందరికీ అవమానం జరిగినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ చరిత్ర లో దీనిని బ్లాక్‌డేగా అభివర్ణించారు. తనను, సబితను, డీకే అరుణను పార్టీ నుంచి పంపించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తమకు జరిగిన అవమానం చెప్పుకొనేందుకూ మైక్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను తాము మోసం చేశామని సీతక అంటున్నారని, ఆమె ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. పార్టీలు మారి వచ్చిన వారిని పక్కన పెట్టుకొని మమ్మల్ని పార్టీలు మారారు అనటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని సునీతాలక్ష్మారెడి మండిపడ్డారు. పార్టీలు మారి వచ్చిన వారిని పక్కన పెట్టుకొని మమ్మల్ని పార్టీలు మారారు అనటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని మండిపడ్డారు. ‘25 ఏండ్లు నేను, సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్ జెండా మోశాం. అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలను కాపాడుకున్నాం.
మహిళలపై చిన్నచూపు మంచిది కాదు
‘ఒక బాధ్యతాయుత హోదాలో ఉండి సీనియర్ మహిళా శాసనసభ్యులను నిండు సభలో కించపరిచేలా మాట్లాడటం చాలా విచారకరం. ఇంకో సభ్యుడు ఇందులో ఏం తప్పులేదని సవరించడం శోచనీయం. ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో మహిళలపై అభిప్రాయం మారకపోవడం, ఆశించినంతగా మహిళలకు సమాన హోదా దక్కకపోవడం బాధాకరం. ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి మాట్లాడినా అది సమస్త మహిళాలోకాన్ని అన్నట్టే. ఇది అధికారపార్టీ నాయకురాళ్లకు కూడా వర్తిస్తుంది. మహిళలపై చిన్నచూపు ధోరణి మంచిది కాదు.
-ఎస్ వాణీదేవి, ఎమ్మెల్సీ