MLA Sabitha Indra Reddy | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే గ్యాంగ్ రేప్‌లు, హత్యలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ ‘తెలంగాణ పోలీసులకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో నంబర్ 1 పోలీసులు ఎవరంటే తెలంగాణ అంటారు. రాష్ర్టానికి పెట్టుబడులు రావాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. పోలీస్‌లపై ఒత్తిడి ఉండొద్దన్న ఉద్దేశంతో 7 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. పోలీస్ సబ్ డివిజన్లను 139 నుంచి 164కి పెంచారు. పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచారు.
5వేల వాహనాల నుంచి 15వేల వాహనాలను అందుబాటులో ఉంచాం. ఫోన్ చేయగానే బాధితులకు అండగా నిలిచేలా వ్యవస్థను తీర్చిదిద్దాం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ దేశంలోనే తొలిసారిగా షీ టీంలతో భరోసా కల్పించాం. ప్రతి స్టేషన్‌కు నిధులు కేటాయించాం. హోంగార్డుల వేతనాలు పెంచాం. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. నిమిషంలోనే లక్ష వాహనాల సీసీ పుటేజ్‌లను రికార్డు చేసే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాం. ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర పోలీస్ శాఖకు 60 అవార్డులు వచ్చాయి’ అని సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు.
రాష్ట్రంలో 11.10 లక్షల కెమెరాలు ఏర్పాటు చేశామని, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల పర్యవేక్షణతో కేసులు పరిష్కరించామని, కొత్తగా ఏర్పడిన 10 జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేశామని సబిత చెప్పారు. తెలంగాణ పోలీసింగ్ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచిందని, ప్రపంచంలో 16వ స్థానం పొందిందని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2023 తెలిపినట్టు గుర్తుచేశారు. 2019లో 19వ స్థానం, 2020లో 10వ స్థానం, 2023లో 1వస్థానంలో నిలిచింది. ఇది గత ప్రభుత్వ డైరెక్షన్, పోలీసుల పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. పోలీసు ఉద్యోగాల నియామకం, పోలీస్ వ్యవస్థలో ఆదాయం పెంపు, గస్తీల పెంపు, సీసీ కెమెరాల నిర్వహణ, అత్యాధునిక పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, వేతనాల పెంపు, మహిళల రిజర్వేషన్లు, పోలీస్స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు, శిక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సబిత వివరించారు. బాధితులకు తక్షణ సాయం చేయడంలో దేశంలో తెలంగాణ పోలీసులకు 5వ స్థానం దక్కిందని గుర్తుచేశారు.
పోలీసులు పనిచేయడం లేదనో! పోలీసులపై నిందలువేసి వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయాలనో తాను మాట్లాడడం లేదని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.ప్రస్తుతం రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో హత్యలు పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు పెట్రేగిపోతున్నాయని ఇవన్నీ చూస్తుంటే ఆందోళన కలుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలే వారం పదిరోజులుగా పతాక శీర్షికతో ఈ నగరానికి ఏమైందని రాశాయని, జూన్‌లో రోజుకో హత్య జరిగినట్టు రాశాయని, ఆదివారం 3 హత్యలు జరిగాయని ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చిందని చెప్పారు.
గిరిజన మహిళపై అత్యాచారం జరిగితే ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లి పరామర్శించేదాకా ప్రభుత్వం తరఫున ఎవరూ వెళ్లలేదని సబిత ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిందని, మలక్‌పేటలోని అంధుల పాఠశాలలో వికారాబాద్‌కు చెందిన అంధబాలికపై రేప్ జరిగితే 10-15 రోజుల తర్వాత ప్రభు త్వం తరఫున పరామర్శించారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేస్తే10 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.