మణికొండ, సెప్టెంబర్ 08: ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట డ్రామా నడుపుతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గండిపేట మండలం అల్కాపూర్ టౌన్షిప్లో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో జరిగింది. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి చేయడం చేతకాక, నాటి సంక్షేమ పథకాలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం హైడ్రా పేరుతో ఒక కొత్త స్టంట్ మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాధ్యంకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వాన్ని నడపడంలో అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లాయని తెలిపారు. గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు పెట్టుబడుల పెట్టేందుకు క్యూ కట్టారని తెలిపారు. ఇప్పుడు అన్ని రంగాల్లో కుదేలైన తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఎఫ్టీఎల్ పేరుతో 30 వేల ఎకరాల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని చెప్తున్న ప్రభుత్వం.. వాటిల్లో 10 శాతం అయినా స్వాధీనం చేసుకుంటే గొప్పేనని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి చెప్పారు. అప్పుడే తాము హైడ్రా పనితీరు గురించి మాట్లాడుతామని తెలిపారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. దీనికోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.