హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 6 (నమస్తే తెలంగాణ) : ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాంపల్లిలోని సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దాదాపు 15 ఏండ్లపాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో మంగళవారం సీబీఐ కోర్టు జడ్జి రఘురామ్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఐదుగురిని దోషిగా తేల్చిన కోర్టు సబిత సహా మరొకరికి క్లీన్చిట్ ఇచ్చింది. ఈ కేసులో సబిత తొమ్మిదో నిందితురాలిగా ఉన్నారు. అప్పట్లో గనులశాఖ మంత్రిగా ఉన్న సబితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. ఆమెతోపాటు నిందితునిగా ఉన్న అప్పటి పరిశ్రమలశాఖ కార్యదర్శి కృపానందంను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వెలువడిన అనంతరం సబిత కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.
ఈ కేసులో 12 ఏండ్ల క్రితం తాను కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని తెలిపారు. ఏ తప్పూ చేయకపోయినా నిందితురాలిగా చేర్చినందుకు బాధకు గురయ్యానని అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ప్రతి ఎన్నికల సమయంలో ఈ కేసును ఆసరాగా తీసుకుని ప్రతిపక్షాలు తనపై తప్పుడు ప్రచారం చేశాయని అన్నారు. అవినీతిపరురాలని, జైలుకు వెళుతుందని తనపై ఆరోపణలు చేసినప్పటికీ తన వెన్నంటే ఉండి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని అప్పుడూ..ఇప్పుడు అదే మాట చెబుతున్నానని అన్నారు. ఓబుళాపురం గనుల కేసు లో న్యాయస్థానం తనను నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ‘ఏ తప్పూ చేయకపోయినా ఈ కేసులో నన్ను చేర్చడంపై బాధపడ్డాను. న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. ఇన్నేండ్లుగా పడిన అవమానాలు, ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలినని, జైలు కు పోతానని మాటలు అంటుంటే ఎంతో బా ధపడ్డాను. నా జిల్లా ప్రజలు, నియోజకవర్గం ప్రజలు నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచారు. నన్ను గెలిపిస్తూ వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 6 (నమస్తే తెలంగాణ) : ఓబుళాపురం మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డితోపాటు ఐదుగురిని నాంపల్లి సీబీఐ కోర్టు దోషులుగా ఖరారు చేసింది. వీరందరికి ఏడేండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, మొఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్‌రెడ్డికి జైలుశిక్షతోపాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ.2 లక్షల జరిమా నా విధించింది. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, శిక్షను తగ్గించాలని గాలి జనార్దన్‌రెడ్డి కోర్టును వేడుకున్నారు.
ప్రజలకు సేవచేస్తున్నానని, తానెప్పుడూ మోసాల కు తావివ్వలేదని, పేదలకు అంకితభావంతో సేవచేసే అవకాశం కల్పించాలని కోర్టును కో రారు. తన సేవలను గుర్తించి ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని తెలిపారు. గతం లో మూ డేండ్లు జైల్లోనే గడిపానని తెలిపారు. నలుగురు దోషులు జరిమానా కట్టని పక్షంలో అదనంగా జైలు శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టంచేసింది. నలుగురు దోషులను అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ కేసులో వీడీ రాజగోపాల్‌కు కోర్టు అదనంగా మరో నాలుగేండ్ల జైలుశిక్ష విధించింది. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద అదనపు శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందుకుగాను 11 ఏండ్ల పాటు జైలుశిక్ష అనుభవించాలని పేర్కొంది.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 2007 జూన్ 18న ఓబుళాపురం గనులను ఓఎంసీకి లీజుకు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో 2009 డిసెంబర్ 7న సీబీఐ కేసు న మోదు చేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉన్నది. సీబీఐ నాలుగుసార్లు చార్జిషీట్ దాఖలు చేసి 219 మంది సాక్షులను విచారించింది. పెద్ద ఎత్తున మైనింగ్ చేపట్టినట్టు సీబీఐ గుర్తించింది. సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉండటంతో అమె పేరును కూడా కేసులో చేర్చారు. ఏ5గా ఉన్న లింగారెడ్డి మృతిచెందగా ఏ6గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని 2022లో ఈ కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి చేసింది. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను నిర్దోషులుగా ప్రకటించింది.