ఖమ్మం/మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి శంకరగిరిమాన్యాలు తప్పవని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, హరిప్రియానాయక్ హెచ్చరించారు. సోమవారం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి పొంగులేటి, జూపల్లికి లేదని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. అధికారం కోసం పాకులాడే పొంగులేటికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్పై అసత్య ఆరోపణలను సహించబోమని హెచ్చరించారు. తన వర్గాన్ని పోషించుకోవడానికే పొంగులేటి బీఆర్ఎస్లోకి వచ్చారని, పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూశారని విమర్శించారు. ఎంపీగా పొంగులేటి ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
గౌరవమిచ్చిన పార్టీనే విమర్శిస్తారా? : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
క్రమశిక్షణ పాటించకుండా ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించినందునే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వీళ్లిద్దరూ ప్రభుత్వంలో ఉం డి.. లాభపడి.. దానినే విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. ఓపిక, సహనం అవసరమన్న విషయన్ని జూపల్లి గుర్తిస్తే బాగుండేదని చురకలేశారు. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా జూపల్లి పనిచేసినా పార్టీ ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు. కొల్లాపూర్ వచ్చిన సందర్భంలో మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పలుకరించారని, పార్టీలో సముచిత స్థానం కల్పించినా విమర్శలు చేయడం తగదని హితవు చెప్పారు.