సూర్యాపేట, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటలోని తన భూమిపైకి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచందర్‌నాయక్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని గుండపనేని లక్ష్మీనర్సింహారావు అనే వ్యక్తి ఆరోపించారు. గురువారం భూమిని ఆక్రమించేందుకు అనుచరులతో రాగా అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ 1990లో సూర్యాపేటకు చెందిన మధుసూదన్‌రెడ్డి, సువర్ణ, యాకూబ్ మేస్త్రీ వద్ద లింక్ డాక్యుమెంట్లు సరిచూసుకొని 50గుంటల భూమి కొనుగోలు చేశానని తెలిపారు.
2010లో విశ్రాంత తహసీల్దార్ సుందర్రావు ఇచ్చిన ఫేక్ పాస్‌బుక్‌తో తమ భూమిని అక్రమ డాక్యుమెంటేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. నాటి కలెక్టర్ రిజ్వీకి ఫిర్యాదు చేయగా ఆ పాస్‌బుక్‌ను రద్దు చేస్తూ, ఎలాంటి రిజిస్ట్రేషన్లూ చేయొద్దని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తుచేశారు. 2016లో రాంచందర్‌నాయక్ భూమిని అక్రమించుకునేందుకు ప్రయత్నించగా, అడ్డుకొని అన్ని రకాల పత్రాలను ఉన్నతాధికారులకు సమర్పించడంతో ఆయనపై కేసు నమోదైనట్టు పేర్కొన్నారు. మళ్లీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ఈ విషయం ఎస్పీ, డీజీపీ, సీఎం దృష్టికి సైతం తీసుకెళ్తానని చెప్పారు.