ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 18: రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోరుతున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ జేఏసీ, టీఎస్‌జేఏసీ, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నిరుద్యోగ, విద్యార్థి రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, విద్యార్థుల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసింది విద్యార్థులేనని గుర్తుచేశారు. ఆనాడు ఏ ఒక్క నాయకుడి కుటుంబసభ్యులు చనిపోలేదని, కేవలం విద్యార్థులే ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు.
గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచి డిసెంబర్లో పరీక్షలను నిర్వహించాలని కోరారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తితో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. 25 వేల ఉద్యోగాలతో తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతోపాటు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.