దుబ్బాక,అక్టోబర్23 : కాంగ్రెస్ ప్రభుత్వంలో(Congress government) రైతులకు కష్టాలు, కన్నీళ్లే దిక్కయ్యా యని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి(MLA Prabhakar Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలపై హడావుడి చేయడం తప్పా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు (Grain purchase)చేయడంలో ప్రభుత్వం ఆసక్తి కనబరచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మార్కెట్‌యార్డును ఎమ్మెల్యే ఆకస్మికంగా పరిశీలించారు. యార్డులో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు తమ ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
గత పది రోజులుగా యార్డులో పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆకాల వర్షంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు యార్డులో ధాన్యం బస్తాలు రాలేదని, కొనుగోలు చేసేందుకు అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ముందు గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రైతులను హరిగోస పెడుతుందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలతో మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హడావుడి చేయడం తప్పా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. ఇప్పటివరకు రైతుల ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మండిపడ్డారు. రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు పతనం తప్పదన్నారు.