బాన్సువాడ/పోతంగల్, అక్టోబర్ 18: కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ, పోతంగల్లో శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం పథకంలో భాగంగా కేసీఆర్ అడిగినన్ని ఇండ్లు ఇచ్చారని గుర్తుచేశారు.
గతంలో ఒక్కో నియోజకవర్గానికి 1400 ఇండ్లు మంజూరు చేస్తే, తాను మాత్రం కేసీఆర్ సహకారంతో 11 వేల ఇండ్లను తీసుకొచ్చానని చెప్పారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వడంలో కేసీఆర్ అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని, వేలాది కోట్ల రూపాయలు తెచ్చి బాన్సువాడను అభివృద్ధి చేశానని పోచారం పేర్కొన్నారు. అనంతరం బీర్కూర్ మండలంలో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్రాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నేతలు పాల్గొన్నారు.